హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పదవీ కాలం ముగిసిన మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో మంగళవారం చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్మల్ మున్సిపల్ పాలకవర్గం గడువు మార్చి 25తో ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మున్సిపాలిటీకి పాలకవర్గం లేక అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడంలేదని అన్నారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వార్డుల విభజన ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేసి ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతతోపాటు ఇతర ఏర్పాట్లను చేసినట్లయితే తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వం నిర్ణయం తెలియజేయాలంటూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.