హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ను మళ్లీ నిర్ణయించాలని హైకోర్టు జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఐదుగురు సభ్యుల కమిటీ సూచనలను పరిశీలించి 8 వారాల్లోగా ఎఫ్టీఎల్ను స్థిరీకరించాలని బుధవారం వెలువరించిన తుది తీర్పులో స్పష్టం చేసింది.
అహంతో అయినవాళ్ల మధ్య అగాధం
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): అయినవాళ్ల మధ్య చిన్నచిన్న విషయాలలో విభేదాలు వస్తున్నాయని, అహంకారం వల్ల వారి మధ్య అగాధం పెరుగుతున్నదని హైకోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. అన్నదమ్ములు, అన్నాచెళ్లెల్ల మధ్య అహంతోనే.. ఆస్తుల వివాదాలు మొదలౌతున్నాయని అభిప్రాయపడింది. పట్టువిడుపులు లేకుండా పంతాలు, పట్టింపులకు పోవడంతో అయినవాళ్లు ఒకరిపై మరొకరు కేసులు వేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొంది. పెద్దల మాటలకు విలువ ఇవ్వకపోడం, సామరస్యంగా సమస్యను పరిషరించుకోకపోవడానికి అహమే కారణమని వ్యాఖ్యానించింది. సూర్యాపేట జిల్లాలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై రాహుల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అహంకారంతో మాటలు పెరిగి, గొడవలకు దారితీసి కేసులు పెట్టుకోవడానికి తన ముందున్న పిటిషన్ ఒక ఉదాహరణ అని అన్నారు. కేవలం 264 చదరపు గజాల కోసం కోర్టు వివాదాన్ని నడుపుతున్నారని, ఇందులో ఆరుగురికి వాటా ఉన్నపుడు ఒకొకరికి 50 గజాలు కూడా రాదని, వచ్చినా ఏ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతించదని అన్నారు. కేసు పరిషారమైనా ఏ ఒకరికీ ఆనందం మిగలదని చెప్పారు. ఇలా కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివాదాలను కోర్టు పరిధిలోకి తెచ్చి, పరిశ్రమల చట్టంలో ఉన్నట్టు ఓ వివాద పరిషార నిపుణుడిని ఏర్పాటు చేస్తే సమస్యలకు పరిషారం లభిస్తుందని సూచించారు. అదేవిధంగా తల్లిదండ్రులున్నంత వరకు పిల్లలకు ఆస్తిలో వాటా లేకుండా చేసేలా చట్టం వస్తే బాగుంటుందని, అలా జరిగితే కేసులే ఉండవని అన్నారు.