హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): చేప పిల్లలు పంపిణీ చేసిన వారికి నగదు చెల్లించాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు హైకోర్టు తేల్చి చెప్పింది. తమ ఆదేశాలు అమలు చేస్తారా? లేక కోర్టుకు హాజరవుతారా? అని ప్రశ్నించింది. ఈ కేసులో ఫిబ్రవరిలోనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది.
చివరిసారిగా నాలుగు వారాలు గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది. 2023-24 సంవత్సరానికి తాము అందజేసిన ఫిష్ సీడ్స్‌కు సంబంధించిన నగదు చెల్లింపులో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఆరే ఫిషరీస్ ట్రేడర్స్ అండ్ సీడ్ సప్లయర్స్ యజమాని రాజ్‌కుమార్, ఇతరులు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వీటిని జస్టిస్ కాజ శరత్ బుధవారం విచారించి కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ఆదేశించింది.