హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి, వేధించారన్న ఆరోపణల నేపథ్యం లో గత నెల 28 నుంచి 31 వరకు ఉస్మానియా పోలీస్ స్టేషన్లో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 18న ఆ ఫుటేజీని సమర్పించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. తమ సోదరుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి, వేధించడంతోపాటు తమను బెదిరించి, కేసు నమోదు చేశారంటూ రాగన్నగూడెంకు చెందిన న్యాయవాది జే జోయల్, అతని సోదరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం ఈ ఆదేశా లు జారీ చేశారు.
ఉలూం సొసైటీకి చుక్కెదురు ; స్టేకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ అనుమతుల రద్దుపై ఏఐసీటీఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ సొసైటీ ఆధ్వర్యంలోని ఇంజినీరింగ్,ఇతర కాలేజీల అనుమతుల రద్దు ను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లడం లేదని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం తేల్చిచెప్పింది. ఒకవేళ ఏవైనా ఇబ్బంది ఎదురైతే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్లకు స్పష్టం చేసింది.