హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాబక్ష్‌పల్లిలో శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ భూసేకరణకు నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారులపై తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ టీ వినోద్‌కుమార్ ఆదేశించారు. ఈ ప్రక్రియలో అధికారులు చేతివాటం ప్రదర్శించారని, ప్రాజెక్టు కోసం సేకరించిన తన భూమికి పరిహారం చెల్లించాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన రాళ్ల శ్రీనివాసాచారి పిటిషన్ వేశారు.
నోటిఫికేషన్ జారీ తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పిటిషనర్ భూమిలో గ్రామపంచాయతీ, మండల అధికారుల అనుమతితో నిర్మాణాన్ని చేపట్టారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. నోటిఫికేషన్ అమల్లో ఉండగానే అధికారులు నిర్మాణానికి ఎలా అనుమతి ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పిటిషనర్ భూమి కోర్టు వివాదంలో ఉండగా నిర్మాణాలకు ఎలా అనుమతిస్తారని ఆగ్రహం వ్యక్తంచేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
నేరెళ్ల దాడి కేసు నివేదికివ్వండి
హైదరాబాద్, జనవరి 2, నమస్తే తెలంగాణ: సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 2017లో దళితులపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులపై నమోదుచేసిన కేసు పురోగతి ఏదశలో ఉన్నదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నెల రోజుల్లో గా ఇవ్వాలని గడువు విధిస్తున్నట్టు పేర్కొన్నది. బాధితులకు పరిహారం ఇచ్చారో లే దో, పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారో లేదో చెప్పాలని ఆదేశించింది. ఈ మేర కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులను జారీచేసింది. కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కేసు వివరాలు తెలుసుకోకుండానే కోర్టు హాలుకు వచ్చి వాయిదా కోరడం సబబు కాదని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.