FTL | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) పరిధిని ఎలా నిర్ణయిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎఫ్టీఎల్ను నిర్ణయించేందుకు చట్టపరమైన నిబంధనలు గానీ, ప్రభుత్వ విధానాలు గానీ ఏమైనా ఉంటే సమర్పించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను 160 ఎకరాలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారో కూడా చెప్పాలని కోరింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టబేగంపేట గ్రామం సర్వే నంబర్ 47లోని అమర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న తన ప్లాట్లోని నిర్మాణాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ ఎల్ ఊర్మిళాదేవి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. నీటిపారుదల శాఖ మ్యాప్ ప్రకారం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 65 ఎకరాలు మాత్రమే ఉన్నప్పటికీ అధికారులు 160 ఎకరాలు ఉన్నట్టు చెప్తున్నారని, దీనివల్ల ప్రైవేట్ ఆస్తులన్నీ అందులోకి వస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలో ప్రైవేటు భూమి ఏమైనా ఉన్నట్టయితే భూసేకరణ చట్టం కింద ఆ భూమిని సేకరించాలని వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎలాంటి చట్టం అమలులో లేని పక్షంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రామాణికమవుతుందని వ్యాఖ్యానించింది. ఎఫ్టీఎల్ నిర్ధారణకు అనుసరించే పద్ధతులు, నిబంధనలు ఏవైనా ఉంటే చెప్పాలని ప్రభుత్వాని ఆదేశించింది. ఒకవేళ లేని పక్షంలో మార్గదర్శకాలు జారీచేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.