హైదరాబాద్, మే 2, ( నమస్తే తెలంగాణ) : గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కింది కోర్టులో ఏ దశలో ఉందో చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గోపన్‌పల్లిలో సర్వే నంబర్ 127లోని 31 ఎకరాలకు సంబంధించి హకుల వివాదంలో ఎస్సీ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, రేవంత్‌రెడ్డి సోదరుడు ఏ కొండల్‌రెడ్డి, ఏ లక్ష్మయ్యల మధ్య వివాదం తలెత్తగా.. అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతో సొసైటీకి చెందిన స్థలంలోకి అక్రమంగా చొరబడ్డారని, అడ్డుకున్న తనపై కులం పేరుతో దూషించారంటూ ఎన్ పెద్దిరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి 2019లో కింది కోర్టులో అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు.
కింది కోర్టులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ మౌసమీ భట్టాచార్య విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దిరాజు తరఫున న్యాయవాది నిమ్మ నారాయణ వాదనలు వినిపిస్తూ.. 2019లో అభియోగ పత్రం దాఖలు చేసినా ఇప్పటివరకు అభియోగాలు నమోదు చేయలేదని పేర్కొన్నారు. 2019 జూలైలో రెండుసార్లు కోర్టులో విచారణకు వచ్చిన కేసు ఆ తర్వాత 2025 జనవరి 31న, ఏప్రిల్ 21న వచ్చిందని తెలిపారు. రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సీ రఘు వాదనలు వినిపిస్తూ కేసులో పిటిషనర్ పాత్ర లేకపోయినా రాజకీయ కక్షసాధింపులో భాగంగా కేసు పెట్టారని పేర్కొన్నారు. విచారణలో తన ప్రమేయం లేదన్నారు. ఇరుపక్షాల వాదన విన్న న్యాయమూర్తి కింది కోర్టులో విచారణ ఏ దశలో ఉందో పూర్తి వివరాలు, పత్రాలతో సమర్పించాలని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాదికి ఆదేశిస్తూ, విచారణను జూన్ 13కు వాయిదా వేశారు.
హైదరాబాద్, మే 2 (నమస్తేతెలంగాణ) : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భూముల అంశంపై సుప్రీంకోర్టులో ఈనెల 16న కేసు విచారణ ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టులో వ్యవహరించాల్సిన అంశాలు, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై అధికారులతో సీఎస్ రామకృష్ణారావు చర్చించినట్టు సమాచారం.
ఈనెల 5వ తేదీ నుంచి జూన్ 6 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మే 7, 14, 21, 28, జూన్ 4వ తేదీల్లో కోర్టులు కేసుల విచారణ చేపడతాయని పేర్కొన్నారు. విచారణ తేదీకి రెండు రోజుల ముందు పిటిషన్ల ఫైలింగ్ ఉంటుందని తెలిపారు. మే 7న జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ జే శ్రీనివాసరావుల బెంచ్, జస్టిస్ పుల్లా కార్తీక్ ఏకసభ్య బెంచ్‌లు విచారణ చేపడతాయని పేర్కొన్నారు. మే 14న జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ నందికొండ నర్సింగ్రావుల బెంచ్, జస్టిస్ జే శ్రీనివాసరావు ఏకసభ్య, మే 21న జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ నందికొండ నర్సింగ్రావుల బెంచ్, జస్టిస్ జే శ్రీనివాసరావు ఏకసభ్య, మే 28న జస్టిస్ నగేశ్, జస్టిస్ లక్ష్మీనారాయణల బెంచ్, జస్టిస్ శరత్ ఏకసభ్య, జూన్ 4న జస్టిస్ కే శరత్, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు బెంచ్, జస్టిస్ కే సుజన ఏకసభ్య బెంచ్‌లు విచారణ చేపడతాయని వివరించారు.