High Court | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హకును కల్పించకుండా ఎందుకు నిరాకరిస్తున్నారో వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘానికి హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు ఓటు హకు కల్పించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఎస్జీటీ కృష్ణమూర్తి దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ పీఎస్, యూపీఎస్ టీచర్లకు ఓటు హకు లేకుండా ప్రభుత్వం సర్యులర్ జారీ చేసిందని చెప్పారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో సమానంగా వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం వివక్ష చూపడమేనని అన్నారు.