Musi Project | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మూసీ, దాని పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు ఏ విధానాన్ని అమలు చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. అసలు ఆక్రమణల తొలగింపునకు ఏదైనా విధానం రూపొందించారో, లేదో చెప్పాలని ఆదేశించింది. విధానం అంటూ ఏమైనా ఉన్నదా? అని ప్రశ్నించింది. 1900లో సర్వే చేసి ఎఫ్టీఎల్ నిర్ధారించాక జరిగిన నిర్మాణాల తొలగింపునకు ఇప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని నిలదీసింది. మూసీ డెవలప్మెంట్లో భాగంగా ఏ చర్య చేపడతారన్నది వివరించాలని స్పష్టంచేసింది. ఏ చర్యలు తీసుకున్నా చట్టప్రకారమే ఉండాలని ప్రభుత్వానికి సోమవారం ఆదేశాలు జారీచేసింది. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల గుర్తింపులో భాగంగా అధికారులు మార్కింగ్ ప్రక్రియ చేపట్టడంతో కూల్చివేతలు చేపడతారన్న భయంతో పలువురు లంచ్మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదిస్తూ.. ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణల తొలగింపు చర్యలు తీసుకోబోమని చెప్పారు. ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని తెలిపారు. ఆ కమిటీ బాధితులతో చర్చలు జరుపుతున్నదని, ఇండ్లు కోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయంగా ఇండ్లు చూపిస్తామని వివరించారు. సుమారు 2,100 మందిదాకా పేదలు ఉన్నట్టు కలెక్టర్ గుర్తించారని వెల్లడించారు. ప్రభుత్వ హామీని రికార్డుల్లో నమోదు చేసిన హైకోర్టు.. మొత్తం చెరువులన్నింటినీ గుర్తించి ఎఫ్టీఎల్ నిర్ధారించాక చర్యలు చేపట్టేలా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శికి సూచించాలని సలహా ఇచ్చింది. ఏ చర్య చేపట్టినా చట్టప్రకారం ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.