హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న కంపెనీలు, సంస్థలపై చేపడుతున్న చర్యలేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారని, వారికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి 2016లో ఎమ్మెల్యే హోదాలో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు మంగళవారం ఈ నోటీసులు జారీ చేసింది.
నకిలీ విత్తన వ్యాపారుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.