హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసుస్టేషన్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గురువారం ఆదేశించింది. ఈ కేసులో నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలను అందజేయాలని పోలీసులను ఆదేశించింది.
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం నకిరేకల్ గురుకుల పాఠశాలలో లీక్ అయిందంటూ ట్విట్టర్లో పోస్టు చేయడంపై కేటీఆర్ మీద పోలీసు కేసులు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరిపారు. కేటీఆర్ తరఫున న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ.. పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన విషయాల ఆధారంగా ట్వీట్ చేశారని తెలిపారు.
కేవలం రాజకీయ కక్షసాధింపుతో పోలీసులకు ఫిర్యాదులు చేయించారని, ఆ తప్పుడు కేసులను కొట్టేయాలని కోరారు. ఒకే నే రానికి సంబంధించి పలుచోట్ల ఎఫ్ఐఆర్లను నమోదు చేయడానికి వీల్లేదని తెలిపారు. ఈ మేరకు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తుచేశారు. హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. ఇదే తరహాలో మరొకరు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని కేటీఆర్ సవాల్ చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.