హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 148ఏ ప్రకారం ఐటీ రిటర్న్‌ల రీ-అసెస్మెంట్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆర్థిక చట్టం- 2021 కింద ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను చట్టం- 1961లోని సవరించిన నిబంధనలకు అనుగుణంగా రీఅసెస్మెంట్ ఉండాలని స్పష్టం చేసింది. రీఅసెస్మెంట్ నేరుగా ప్రత్యక్షంగా ఉండకూడదని జస్టిస్ పీ శ్యామ్ కోషి వెలువరించిన ఉత్తర్వుల్లో పేరొన్నారు. సెక్షన్ 148ఏ కింద ప్రొసీడింగ్స్‌కు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) రెండు పథకాలను చేర్చడాన్ని ప్రస్తావిస్తూ, కోర్టు ఆదాయ పన్నుల విభాగానికి రెండు షరతులు తప్పనిసరని నొకి చెప్పింది. 144బీ సెక్షన్ ప్రకారం ఐటీ శాఖ ఆర్థిక చట్ట నిబంధనలను అమలు చేయాలని తెలిపింది. ఐటీ శాఖ జారీ చేసిన 148ఏ నోటీసులను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు విచారణ జరిపింది. ఆశీష్ అగర్వాల్ కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా 148ఏ నోటీసు ఉన్నదని, సవరించిన చట్ట నిబంధనలకు అనుగుణంగా 144బీ సెక్షన్ ప్రకారమే ఉండాలని స్పష్టం చేసింది.