హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ మండలంలో 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలకశాఖ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, పురపాలక శాఖ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులను జారీచేసింది.
వీధికుకల నియంత్రణ, వాటి సంరక్షణకు జంతు జనన నియంత్రణ నిబంధనలు 2023 ప్రకారం అన్ని చర్యలు చేపట్టినట్టు పేర్కొంటూ హైకోర్టుకు బుధవారం జీహెచ్ఎంసీ నివేదికను సమర్పించింది. దాడుల నియంత్రణ చర్యలు చేపట్టినట్టు చెప్పింది. వీధి కుకలకు పెర్గిలైజేషన్ చేస్తున్నట్టు చెప్పింది. జంతు జనన నియంత్రణ (ఏబీసీ) 23 నిబంధనల అమలులో భాగంగా తీసుకుంటున్న చర్యల గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. వీధికుకల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టడంలేదని, తగిన ఆహారం లేక మనుషులపై దాడి చేస్తున్నాయంటూ వనస్థలిపురానికి చెందిన ఎం విక్రమాదిత్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నిరుడు ఫిబ్రవరి 19న హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ పాఠశాల విద్యార్థిపై కుకలు దాడి చేయడంతో మృతి చెందిన సంఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకున్నది.
కాశీబుగ్గ, సెప్టెంబర్ 18: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి క్వింటాకు రూ.7810 పలికింది. ఈ సీజన్లో అత్యధికంగా మంగళవారం రూ.7860 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి డిమాండ్ ఉండటంతో మద్దతు ధరను మించి ధరలు పలుకుతున్నట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి. కాగా.. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం కొత్తపత్తి వచ్చింది. దీంతో వ్యాపారులు ప్రత్యేక పూజలు చేసి తూకం వేశారు. ఈ సందర్భంగా మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల కొబ్బరికాయ కొట్టి కాంటాను ప్రారంభించారు.