High court | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైకోర్టును రాజేంద్రనగర్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో 100 ఎకరాల్లో కొత్త భవనం నిర్మించేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో గురువారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో కొత్త భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎం దృ ష్టికి తీసుకువచ్చారు.
రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం వారసత్వ కట్టడం కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. భవనాన్ని పునరుద్ధరించి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.