High Court | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ‘అవి పోలీస్స్టేషన్లు కావు.. సెటిల్మెంట్ అడ్డాలు. చట్టం, కోర్టులు, కోర్టు ఆర్డర్లతో వాటికి పనిలేదు. చట్టాన్ని చుట్టంలాగా చాప చుట్టేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా పోలీసులే సెటిల్మెంట్ పెద్దలుగా అవతారం ఎత్తుతున్నారు. పోలీస్స్టేషన్లలోనే సెటిల్మెంట్స్ చేస్తున్నారు. పోలీసుస్టేషన్లకు వెళితే కేసు నమోదు, దర్యాప్తు, ఆపై కోర్టుకు చార్జిషీట్, చివరికి కోర్టు తీర్పు.. వీటిని చాలామంది పోలీసులు తోసిరాజని.. తామే రారాజు మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీస్‌స్టేషన్స్‌లో సెటిల్మెంట్స్ ధోరణి తారస్థాయికి చేరింది. ఈ తీరును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడానికి వీల్లేదు’ అని రాష్ట్రంలో పోలీసుల తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు జారీచేసిన ఇంజంక్షన్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ పిటిషన్లు దాఖలవుతున్నాయని పేర్కొంది. ఈ కేసులను చూస్తే పోలీస్స్టేషన్లను సెటిల్మెంట్ అడ్డాలుగా మార్చానిపిస్తున్నదని వ్యాఖ్యానించింది.
పోలీసుల విధులపై డీజీపీ సమీక్షించాలి
పోలీసులు తమ బలాన్ని ఉపయోగించి ఇంజంక్షన్ ఆదేశాలను ఉల్లంఘించకూడదని హైకోర్టు స్పష్టంచేసింది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని ఆస్తులను చాలాకాలంగా స్వాధీనంలో ఉందని చెప్పి హకులు కోరడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేసింది. పౌర వివాదాలలో పోలీసుల జోక్యానికి తావు లేకుండా డీజీపీ సర్యులర్ జారీ చేయాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ మంగళవారం మౌఖిక ఆదేశాలు జారీచేశారు. సాధారణ ప్రజలకు నిబంధనల గురించి అవగాహన కల్పించడానికి వాటిని పోలీసుల అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, ఆ నిబంధనలను అన్ని పోలీస స్టేషన్లలోనూ ప్రదర్శించాలని ఆదేశించారు.
విచారణకు హాజరైన రాచకొండ సీపీ
హైదరాబాద్ నాగోల్ సరిల్లోని బండ్లగూడ కృషినగర్‌లో తన ప్లాట్ నంబర్ 65కు సంబంధించి, నాగోలు పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన సివిల్, క్రిమినల్ కేసులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు రూ.55 లక్షలు చెల్లించి పరిషరించుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ బాధితుడు సుదర్శనం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వర్చువల్‌గా హాజరు కాగా, నాగోల్ సీఐ స్వయంగా హాజరయ్యారు. భూమి సమస్యను పరిషరించడానికి పోలీస్‌స్టేషన్‌ను సెటిల్మెంట్ అడ్డాగా మార్చారని హైకోర్టు తప్పుపట్టింది. నాగోల్ పోలీసులు స్థల యజమానిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. గత నెల 19న ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటలవరకు పోలీస్‌స్టేషన్‌లోని సీసీ ఫుటేజీ సమర్పించాలని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
న్యాయమూర్తికే చేదు అనుభవాలు
తాను ఒకసారి సాధారణ పౌరుడిగా పోలీస్‌స్టేషన్‌కు వెళితే.. ఒక పోలీస్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని జస్టిస్ వినోద్‌కుమార్ తెలిపారు. తాను హైకోర్టు న్యాయమూర్తినని తెలిసిన తర్వాత ఎక్కడలేని మర్యాద చూపారని తెలిపారు. మరోసారి అధికార వాహనంలో తాను వెళ్తుంటే.. రోడ్డుపై ఒక పోలీస్ ఓ పౌరుడిని కొట్టడం చూసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. పోలీసుల వ్యవహారశైలిపై నాకే ఇలాంటి అనుభవాలు ఉన్నాయంటే సామాన్య ప్రజలకు ఇంకెన్ని బాధలు ఉంటాయో అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.
పీఎస్‌లకు వెళ్లాలంటే జనానికి భయం
‘సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినప్పటికీ పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. జనం పోలీస్‌స్టేషన్ మెట్లు ఎకాలంటేనే భయపడుతున్నారు. జనాన్ని కొట్టే అధికారం పోలీసులకు ఎకడిది? చట్టాలు, నిబంధనలు తెలియకుండానే కొందరు పోలీసులు అధికార దర్పంతో విర్రవీగుతున్నారు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
సివిల్ వివాదాల్లో ఎలా జోక్యం చేసుకుంటారు?
అంతకుముందు జరిగిన విచారణ సందర్భంగా.. సివిల్ వివాదాల్లో పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. జోక్యం చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జోక్యం చేసుకోకుండా నిర్దిష్ట మార్గదర్శకాలను ఆన్లైన్లో పెట్టాలని, అన్ని పోలీస్స్టేషన్లలోనూ ప్రదర్శించాలని చెప్పింది. కేసుల దర్యాప్తును కోర్టులు అడ్డుకోవని, దర్యాప్తు పేరుతో పోలీస్స్టేషన్లను సెటిల్మెంట్లకు అడ్డాలుగా మార్చడానికి వీల్లేదని స్పష్టంచేసింది. రాష్ట్రంలో పోలీసింగ్ సాట్లాండ్ పోలీసులతో పోల్చుకుంటామని చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సెటిల్మెంట్లు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుని ఇతరులకు సందేశం ఇవ్వాలని రాచకొండ కమిషనర్‌కు సూచించింది.