మహబూబ్‌నగర్, డిసెంబర్ 27: రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, మహబూబ్‌నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎన్వీ శ్రావణ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రూ.81 కోట్లతో నిర్మించనున్న నూతన కోర్టు భవన సముదాయానికి న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, బీ విజయ్‌సేన్‌రెడ్డి, టీ మాధవి, నందికొండ నర్సింగరావుతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన భవన సముదాయానికి 2024 నవంబర్ 14న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ సమీపంలోని బండమీదిపల్లిలో భవనం నిర్మించనున్నట్టు చెప్పారు.
కక్షిదారులకు సత్వర న్యాయం లభించే దిశగా పనిచేయాలని సూచించారు. 2025 నవంబర్ 30 నాటికి మహబూబ్‌నగర్‌లో 18,446 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసులు తగ్గించేందుకు కృషి చేయాలని తెలిపారు. జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ కోర్టు భవనానికి స్థలం కేటాయించారని చెప్పారు. శ్రీనివాస్‌గౌడ్‌కు బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్ అండ్ జిల్లా సెషన్స్ జడ్జిలు, న్యాయమూర్తు లు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకి పాల్గొన్నారు.