హైదరాబాద్, మే 4 (నమస్తేతెలంగాణ): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (56) ఏడాది నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో కన్నుమూశారు. మాటూరి అప్పారావు, నాగరత్నం దంపతులకు 1969లో జన్మించారు. ప్రియదర్శిని 1995లో విశాఖపట్నంలోని ఎన్‌బీఎం లా కాలేజీలో ఎల్ఎల్బీ చదివారు. 1995లో ఏపీ బార్కౌన్సిల్లో న్యాయవాదిగా చేరారు. 1997లో ఆంధ్రా వర్సిటీ నుంచి లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లాలో ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. ఆ తర్వాత పలు జిల్లాల్లో న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 2016 నుంచి 2019 వరకు జాతీయ న్యాయ సేవా అథారిటీ బాధ్యురాలిగా బలహీనవర్గాలకు ఉచిత న్యాయ సేవలందించారు. ఆమె నేషనల్ లీగల్ సెల్ అథారిటీ చైర్‌పర్సన్‌గా కూడా విశేష సేవలందించారు. 24 మార్చి 2022న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈక్రమంలో ఏడాది నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. ప్రియదర్శిని అంత్యక్రియలు సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు వారి కుటుంబసభ్యులు తెలిపారు.
పలువురి సంతాపం..
ప్రియదర్శిని మృతిపై న్యాయమూర్తులు, న్యాయవాదులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ జడ్జిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ ప్రియదర్శిని భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ అనంతరం వారు మాట్లాడుతూ ప్రియదర్శిని న్యాయవాదిగా, జిల్లా కోర్టు జడ్జిగా ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. ఆమె న్యాయశాఖకు చేసిన సేవలు మరవలేమని తెలిపారు. ప్రియదర్శిని ఆత్మకు శాంతిచేకూరాలని వారు ప్రార్థించారు.