హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ‘తల్లిదండ్రుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాల్సిన తొమ్మిదేండ్ల కొడుకు కన్న తండ్రి చితికి నిప్పు పెట్టే దయనీయ పరిస్థితి ఏర్పడింది. కేక్ కట్ చేయాల్సిన రోజున తలకొరివి పెట్టడం ఆ బాలుడి జీవితంలో ఎప్పటికీ మరవలేనిది. ఈ విషాదం ఆ బాలుడి జీవితంలో ఎప్పటికీ చెరిగిపోదు. ఇదేవిధంగా ఆరు కుటుంబాలు పడుతున్న మనోవేదనకు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వ అధికారులు మాది కాదంటే మాది కాదంటూ తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవరికి వారు కాడి వదిలేస్తానంటే కుదరదు. వాస్తవంగా ఆ దుర్ఘటనకు అందరూ బాధ్యులే. విద్యుదాఘాత ఘటనలో ఆరుగురు మరణించడం సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది.
చట్టాన్ని అమలు చేయకుండా ప్రజల ప్రాణాలు ఎలా కాపాడగలం’ అని రామంతాపూర్లో ఇటీవల జరిగిన విద్యుదాఘాత ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు స్తంభాలకు వేలాడుతున్న కేబుళ్లను ప్రభుత్వ ఆదేశాలతో సిబ్బంది ఏకపక్షంగా తొలగించడాన్ని భారతి ఎయిర్టెల్ సంస్థ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం విచారణ జరిపారు. రాష్ట్ర విద్యుత్తు శాఖకు చెందిన స్తంభాలకు ఉన్న అనుమతిలేని కేబుళ్లను తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశించారు.