హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని రకాల పదవులు స్థానిక గిరిజనులకే చెందుతాయని, ఈ మేరకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. లంబాడీ హకుల పోరాట సమితి నగర భేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యాదేవ నాయక్ దాఖలు చేసిన ఈ పిల్‌పై హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్వర్రావు ధర్మాసనం విచారించింది.
ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులు, సభ్యుల పదవులను స్థానిక గిరిజనులకే ఇవ్వాలని గిరిజన సలహా మండలి తీర్మానం చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది మంగీలాల్ నాయక్ తెలిపారు. రాజ్యాంగంలోని 244వ అధికరణ ప్రకారం ఆ పదవులన్నీ గిరిజనులకే చెందుతాయని చెప్పారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది.