హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘రాజాసాబ్’ చిత్రాల నిర్మాతలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపు కోసం ఆ రెండు చిత్రాల నిర్మాతలు చేసుకున్న వినతులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజాసాబ్’ 9న, చిరంజీవి కథానాయకుడుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మితమైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ 12న విడుదల కానున్నాయి. టికెట్ రేట్ల పెంపుతోపాటు ప్రత్యేక షో ల కోసం ఆ రెండు చిత్రాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీ ణ్ కుమార్ ధర్మాసనం.. టికెట్ రేట్ల పెంపునకు నిరాకరిస్తూ గతంలో సింగి ల్ జడ్జి ఇచ్చిన తీర్పు ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘రాజాసాబ్’ చిత్రాలకు వర్తించదని స్పష్టంచేసింది.