హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ విభజనకు ఒకరోజు ముందు ఉమ్మడి రాష్ట్ర చివరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడాన్ని పాలనా వ్యవస్థపై ఆడిన నాటకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అభివర్ణించారు. ఇది అశాస్త్రీయం, ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని వాదించారు. 2014 ఫిబ్రవరి 28న పీకే మహంతి పదవీ విరమణ చేయాల్సి ఉండగా అదే ఏడాది జూన్ 30 వరకు సర్వీస్ పొడిగింపు లభించిందని వివరించారు. ప్రత్యూష్‌సిన్హా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా జరిగిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులకు రద్దు చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్రం దాఖలు చేసిన 16 పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ నందతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది.
ప్రత్యూష్‌సిన్హా కమిటీ చేసిన సిఫార్సులకు చట్టబద్ధత లేదని సోమేశ్‌కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది డీవీ సీతారామ్మూర్తి హైకోర్టులో వాదించారు. కేంద్రం దాఖలు చేసిన రిట్లను కొట్టేయాలని కోరారు. ప్రత్యూష్‌సిన్హా కమిటీ మార్గదర్శకాలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. కమిటీ సిఫార్సులు చేసినప్పుడు సర్వీసులో ఉన్న మహంతిని సీనియారిటీ ప్రకారం ఏపీకి కేటాయించాలని, అలా జరిగితే సోమేశ్‌కుమార్ తెలంగాణ సర్వీసులో కొనసాగుతారని చెప్పారు. అధికారుల కేటాయింపుల జాబితాలో మహంతి పేరే లేదని తెలిపారు. లాటరీలో రోస్టర్‌ను ముందుగా తెలంగాణకు కేటాయించాలన్న నిబంధనను తుంగలో తొకారని, క్యాడర్ కేటాయింపుల అంశంపై కేంద్రం తన వైఖరిని ఇష్టానుసారంగా మార్పు చేసిందని పేర్కొన్నారు. తన అల్లుడు, కుమార్తె ఐఏఎస్‌లుగా ప్రయోజనం పొందే జాబితాలో ఉన్నప్పుడు మహంతి ఆ కమిటీలో సభ్యుడిగా ఉండటం చెల్లదని పేర్కొన్నారు. వాదనల అనంతరం విచారణ వాయిదా ఈ నెల 19కి పడింది.