హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘పట్నం నరేందర్‌రెడ్డి విడుదలైతే ఏం జరుగుతుంది? విడుదల చేస్తే ఆయన ఏం చేస్తారు? పట్నం పారిపోతారని చెప్పనప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? కేసు పెట్టాక సాక్ష్యాధారాల సేకరణ, ఆపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఎందుకు లేవు’ అని హైకోర్టు గురువారం పోలీసులను నిలదీసింది. లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి కింది కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తున్న సమయంలో పలు ప్రశ్నలతో ఉకరిబికిరి చేసింది.
ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. పోలీసులు కేబీఆర్ పారులో వాకింగ్ చేస్తున్న నరేందర్‌రెడ్డిని బలవంతంగా అరెస్టు చేశారని చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పారుల్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటని పీపీని ప్రశ్నించారు. పారిపోతారనిగానీ, దర్యాప్తునకు సహకరించలేదనిగానీ పట్నంపై ఆరోపణలు లేనపుడు అంత హడావుడిగా పారుకు వెళ్లి అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు.
ఈ నెల 11న లగచర్లలో అధికారులపై దాడి జరగడానికి ముందే అక్టోబర్ 27న నరేందర్‌రెడ్డి తన అనుచరులతో ఓ సమావేశాన్ని నిర్వహించారని పీపీ చెప్పారు. సీఎం వచ్చినా, కలెక్టర్ వచ్చినా దాడి చేయాలన్నట్టు ఆ ప్రసంగం ఉందని ఆరోపించారు. దీనిపై బొమ్రాస్పేట పీఎస్‌లో 307 సెక్షన్ కింద కేసు నమోదైందని చెప్పారు. అయితే, ఆ కేసు నరేందర్రెడ్డిపై కాదని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇదే నిజమైతే, ఆ వివరాలు పెన్‌డ్రైవ్‌లో ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించింది. పెన్‌డ్రైవ్‌ను కోర్టు హాల్లో చూడబోనని తేల్చి చెప్పింది. పబ్లిక్ డొమైన్లో కూడా వీడియో ఉందని పీపీ జవాబు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. పబ్లిక్ డొమైన్లో ఉన్న వాటిని తామెలా పరిగణనలోకి తీసుకోవాలో చెప్పాలని నిలదీసింది.
గండ్ర మోహన్‌రావు వాదిస్తూ.. బీఎస్ఎస్ఎన్ 65 సెక్షన్ ప్రకారం అఫిడవిట్ రూపంలో పెన్‌డ్రైవ్ విషయాలను కూడా అందజేయాలని అన్నారు. పట్నం నరేందర్‌రెడ్డి ఓ మాజీ ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా తీవ్రవాదో టెర్రరిస్టో, నేరస్థుడో అన్నట్టుగా మెడపట్టుకుని గెంటుకుంటూ పోలీసులు తీసుకువెళ్లారని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పిటిషనర్ పోలీసులకు సహకరించకుండా, పరారీలో ఉండి పారులో వాకింగ్ చేస్తూ కనిపిస్తే.. అప్పుడు అరెస్టు చేసుంటే అర్థం ఉండేదని వ్యాఖ్యానించింది. పీపీ కల్పించుకుని ఇంట్లోనే అరెస్టు చేశామని చెప్పగానే, అరెస్టు చేసిన సమాచారాన్ని సలీమ్‌కు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ఇంట్లో నరేందర్‌రెడ్డి భార్య లేదా పిల్లలు ఉంటారు కదా.. వాళ్లకు ఎందుకు ఇవ్వలేదని మరోసారి నిలదీసింది.
నిమ్స్ సీఎంవో సుస్మిత ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్లో.. దాడిలో గాయపడిన అధికారులకు వైద్య పరీక్షల తర్వాత క్వశ్చన్ మార్ (ప్రశ్నార్థకం) ఎందుకు పెట్టారని హైకోర్టు ప్రశ్నించింది. గాయాలు చిన్నవో కాదో అనే ప్రశ్నార్థకాన్ని పెట్టారా అని ఆరాతీసింది. చిన్న గాయాలని ఎందుకు రాశారని కూడా ప్రశ్నించింది. చిన్న గాయాలు కాదని, ఫైనల్ ఒపీనియన్ సీరియస్ అని పీపీ చెప్పడంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ‘ఇది ఇంకా వరెస్ట్..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
పిటిషనర్లు కేసుల మీద కేసులు వేస్తున్నారని పీపీ చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టు, రీజన్స్ ఆఫ్ అరెస్టు.. గురించి పట్నం కేసు వేశారు. కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఇంటి వంట కోసం మరో పిటిషన్ వేశారు. అరెస్టు చేసేప్పుడు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ అమలు చేయలేదని పట్నం భార్య మరో పిటిషన్ వేశారు. ఒకే ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లను నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇలా న్యాయపరమైన పోరాటం చేసే హకు వాళ్లకు ఉందని తేల్చిచెప్పింది. కేసులు వేయడంలో తప్పు ఏముందని నిలదీసింది.
నిందితుడు బయటకు వస్తే.. అని పీపీ చెప్పగానే, తాము నిందితుడని కూడా అనడం లేదని గుర్తుచేసింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇలాంటి ఇల్లీగల్ కేసుల వాదనల కోసం రూ.10 కోట్లు రిలీజ్ చేశారని పీపీ చెప్పగానే, ఆధారాలు చూపాలని అడిగింది. రిమాండ్‌ను రద్దు చేయడానికి వీల్లేదని, చార్జిషీట్ దాఖలు చేశాకే పిటిషనర్లకు కోర్టుకు వచ్చే హకులు ఉంటాయని పీపీ చెప్పారు. తమ ముందున్నది బెయిల్ పిటిషన్ కాదని మరోసారి హైకోర్టు తేల్చి చెప్పింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సమయాన్ని కూడా పోలీసులు నమోదు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని గండ్ర కోరారు. పోలీసుల ఎఫ్ఐఆర్లో నరేందర్‌రెడ్డిని ఆయన ఇంట్లో ఉదయం 7 గంటలకు అరెస్టు చేసినట్టు ఉన్నదని, కానీ తొలి రిమాండ్ రిపోర్టులో జిల్లా శిక్షణ కేంద్రం (డీటీసీ) రూమ్‌లో ఉదయం 10.30 గంటలకు అరెస్టు చేసినట్టు పేర్కొన్నారని చెప్పారు. రిమాండ్‌లో ఉన్న నరేందర్‌రెడ్డి బయటకు వస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పీపీ చెప్పారు. సాక్ష్యాలన్నింటినీ ముందుగా సేకరించి అరెస్టు చేయాలని, అలా చేయకుండా 11న కేసు నమోదు చేసి 13న అరెస్టు చేశారని హైకోర్టు ఆక్షేపించింది.
పట్నం బెయిల్‌పై విడుదలైతే దాని ప్రభావం కేసు దర్యాప్తుపై ఉంటుందని పీపీ చెప్పడాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది. తమ ముందున్నది బెయిల్ కేసు కాదని గుర్తుచేసింది. దర్యాప్తులో తాము జోక్యం చేసుకోవడం లేదని స్పష్టంచేసింది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టు, రీజన్స్ ఆఫ్ అరెస్టు.. ఈ రెండింటిపైనే సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్ అమలు కాలేదన్నదే పిటిషన్ అనే విషయాన్ని కూడా గుర్తెరగాలని చెప్పింది. ‘కేసు దర్యాప్తు చేయవద్దని చెప్పడం లేదు.
రిమాండ్ చట్టబద్ధంగా ఉందా లేదా అన్న అంశాన్ని మాత్రమే విచారణ చేస్తున్నాం. అరెస్టు చేసే ముందు అనుసరించాల్సిన విధానాలు అమలు చేశారో లేదో పరిశీలిస్తున్నాం. సుప్రీంకోర్టు డీకే బసు కేసులో జారీచేసిన మార్గదర్శకాలు ఏ మేరకు అమలు జరిగాయో తేల్చుతాం’ అని చెప్పింది. దీనిపై పీపీ కల్పించుకుని, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టు పత్రంపై నరేందర్‌రెడ్డి ఎడమ వైపు సంతకం చేశారని, మరోవైపు ఇంకొకరి సంతకం ఉందని చెప్పారు. ఇద్దరి సంతకాలు ఒకే పేపర్‌పై చేయించడం చెల్లదని, కేసు నమోదు ఇల్లీగల్ అని చెప్పడానికి ఆ ఒక డాక్యుమెంట్ సరిపోతుందని వ్యాఖ్యానించింది.