హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డిలో ఇటీవల సిగాచి కర్మాగారంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం, భారీ పేలుడు ఘటనలపై దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఫ్యాక్టరీలో భద్రతా ని బంధనలు లేవని, బాధిత కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగిందని ఆరోపిస్తూ రిటైర్డ్ శాస్త్రవేత్త కే బాబూరావు ఈ పి ల్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, న్యాయమూ ర్తి జస్టిస్ మొహియుద్దీన్గౌస్తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఈ పిల్‌పై విచారణ జరిపింది.
కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కార్మికులు అందరూ శాశ్వత ఉద్యోగులు కాదని, ఎకువగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వలస కార్మికులని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కార్మికులు అందరికీ పరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇప్పటివరకు ఏమైనా అరెస్టులు జరిగాయా అని ప్రశ్నించగా.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.
ప్రాణనష్టం ఏ మేరకు జరిగింది? కంపెనీని బాధ్యులుగా గుర్తించి కేసు నమోదు చేశారా, ఫ్యాక్టరీలో ఉన్న కార్మికుల సంఖ్య ఎంత, బాధిత కుటుంబాలకు ఏ మేరకు సాయం అందించారు.. వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిల్లో లేవనెత్తిన అన్ని అంశాలకు వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది. తమకు నాలుగు వారాలు సమయం కావాలని అదనపు అడ్వొకేట్ జనరల్ కోరడంపై అభ్యంతరం చెప్పింది.