హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించడాన్ని సవాల్ చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు శనివారం పూర్తయ్యాయి. సోమవారం నాటికి ఇరుపక్షాలు సంక్షిప్తంగా రాతపూర్వక వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశించింది. తాము తీర్పు వెలువరించేలోగా మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టంచేసింది.
మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు పొడిగించడాన్ని రద్దు చేయాలంటూ సోమాజిగూడకు చెందిన డీ వెంకటేశ్వరరావు సహా ఐదుగురు వేసిన పిటిషన్లపై జస్టిస్ ఎన్ తుకారాంజీ శనివారం విచారణ ముగించారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది అవినాశ్‌దేశాయ్ వాదనలు వినిపిస్తూ రూల్స్‌కు విరుద్ధంగా గడువు పెంచడాన్ని మాత్రమే సవాలు చేశామని చెప్పారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ.. దరఖాస్తుల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, షాపుల కేటాయింపునకు సంబంధించి నిర్ణయాల వాయిదాకు నిబంధనలున్నాయని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.