High Court | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా తీరుపై హైకోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. ఏ అధికారం కింద కూల్చివేత చర్యలు చేపడుతున్నారన్న వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక ప్రభుత్వశాఖ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తుంది.. మరో శాఖ ఆ స్థలంలో నిర్మాణాలకు అనుమతిస్తుంది.. ఇంకో ప్రభుత్వశాఖ వచ్చి అది అక్రమ నిర్మాణం అని కూల్చివేస్తుంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవటంతో చివరికి జనం ఇబ్బందులు పడుతున్నారంటూ తప్పుపట్టింది. ఎఫ్టీఎల్ను ధ్రువీకరిస్తూ జారీచేసిన నోటిఫికేషన్లను సమర్పించాలని అడిగితే అధికారులు ఇవ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలోని సర్వే నంబర్ 311(311/7)లోని 1,210 చదరపు గజాల్లోని 3,894 చదరపు అడుగుల ఫాంహౌస్ కూల్చివేతకు అధికారులు చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన బద్వేలు ప్రదీప్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్పల్లి తహసీల్దార్, చీఫ్ ఇంజినీర్‌ను చేర్చారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. ఫాంహౌజ్ కూల్చివేతపై నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాలని హైడ్రాకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉంటే నిబంధనల ప్రకారం నోటీసులు జారీచేసి.. చట్టప్రకారం అనుసరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
విక్రయ దస్తావేజులు, నిర్మాణ అనుమతులు, ఇంటి పన్ను రశీదు.. మొదలైన వాటిని పరిశీలించాకే తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఈలోగా హైడ్రా లేక ఇతర అధికారులు కూల్చివేత చర్యలకు ఉపక్రమిస్తే పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పించారు. ఫాంహౌస్‌కు సంబంధించి తీసుకునే చర్యలు హైడ్రా ఏర్పాటుకు చెందిన జీవో 99 ప్రకారమే ఉండాలని తేల్చిచెప్పారు. ఫాంహౌజ్ ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు ప్రాథమిక, తుది నోటిఫికేషన్ల జారీచేసి ఉంటే అవి ఎప్పుడు జారీచేశారో.. వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదావేశారు.
హైడ్రా విశ్వసనీయతను చాటుకోవాలి: హైకోర్టు
‘హైడ్రాకు ఉన్న పరిధులు ఏమిటి? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏమిటి? డబ్బు కూడబెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆపై, సంబంధిత స్థానిక సంస్థ కార్యాలయ అనుమతితో నిర్మాణం చేస్తే నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు? అక్రమ కట్టడాలైనా చట్టప్రకారం చేయాలి కదా? కూల్చివేతలకు ముందు సంబంధిత అధికారి చట్టప్రకారం భవన యజమానికి నోటీసు ఇవ్వాలి కదా? నోటీసు ఇవ్వకుండా కూల్చివేయొచ్చా? ఏ అధికారం కింద కూల్చివేస్తారు? నోటీసు ఇవ్వాలి. ఆక్రమణదారుల, అనధికార నిర్మాణదారుల హక్కుల పత్రాలను ప్రాథమిక పరిశీలన చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల నుంచి భవన నిర్మాణాలకు పొందిన అనుమతులతోపాటు ఆ స్థలాల రిజిస్ట్రేషన్ దస్తావేజులను కూడా పరిశీలించాలి.
ఆపై, అది అక్రమమో, సక్రమమో అధికారులు తేల్చాలి. ఆ తర్వాతే కూల్చివేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు చట్టప్రకారం గడువు ఇచ్చి చేయాలి కదా? ఏకపక్షంగా కూల్చివేతలు చేస్తున్నారనే అభిప్రాయం ఏర్పడకుండా కూడా చేయాలి కదా? నిర్మాణాలు జరిగిన 15-20 ఏండ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణమని కూల్చివేయటం ఏమిటి? ఫాంహౌజ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని ఎలా నిర్ధారణకు వచ్చారు? ఈ మేరకు ప్రాథమికంగా నోటిఫికేషన్ జారీ చేశారా? ఎప్పుడు చేశారు? ఏ నిర్ధారణకు రాకుండా కూల్చివేత చర్యలు ఎలా చేపడతారు? ఫాంహౌజ్ స్థలం రిజిస్ట్రేషన్‌కు డబ్బులు తీసుకున్నారు. పదేండ్లుగా ఇంటి పన్ను కట్టించుకున్నారు. ఇప్పుడు ఒకసారిగా హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణమని చెప్పి కూల్చేస్తామంటే ఆ వసూళ్లకు అర్థం ఏమిటి? అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా?’ అంటూ ప్రభుత్వాన్ని, హైడ్రాను హైకోర్టు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
60-100 గజాల జాగా ఉన్నవారి విషయంలో ఒకలా, ఎకరా భూమిలోని నిర్మాణం ఉన్నవారి విషయంలో మరోలా వ్యవహరించటానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కూల్చివేతల వ్యవహారంపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. పిటిషనర్ పేరొన్న ఫాంహౌజ్ 2014లో నిర్మాణం జరిగిందని, అంటే పదేండ్లుగా ఆ ఫాంహౌజ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని అధికారులకు గుర్తుకు రాలేదా? అని నిలదీసింది. జీవో99లో పేర్కొన్న నిబంధనలను హైడ్రా కచ్చితంగా అమలు చేయాలని, ఇప్పటివరకు హైడ్రా ఎన్ని కట్టడాలను కూల్చివేసింది? అన్ని కూల్చివేత చర్యల్లో చట్టనిబంధనలను అమలు చేశారా? అని ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా జన్వాడ ఫాంహౌజ్ ఎఫ్టీఎల్ వివరాలు కూడా సమర్పించాలని స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్టీఎల్ను నోటిఫై చేస్తే ఆ వివరాలు కూడా అందజేయాలని వెల్లడించింది. ఇదే సమయంలో తన ఫాంహౌజ్ కూల్చివేయకుండా మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, అక్రమ కట్టడాల కూల్చివేత చర్యలు అడ్డుకోబోమని, స్టే ఉత్తర్వులు జారీ చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో హైడ్రా చర్యలన్నీ చట్టప్రకారమే ఉండాలని తేల్చిచెప్పింది.
రాజకీయ కుట్ర.. పిటిషనర్ వాదన
హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలన్న కోర్టు ఆదేశాలపై మధ్యాహ్నం తిరిగి విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. హైడ్రా ఏర్పాటుకు ప్రభుత్వం గత నెల జీవో 99 జారీ చేసిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీలకు హైడ్రా సమన్వయకర్తగా వ్యవహరిస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేస్తుందని, తదుపరి చర్యలు హైడ్రా తీసుకుంటుందని, చట్ట నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని వివరించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వీ హరిహరన్ వాదిస్తూ.. పిటిషనర్ ఫాంహౌజ్ నిర్మాణానికి 2014లో గ్రామపంచాయతీ అనుమతులు లభించాయని, ఫాంహౌజ్‌ను 2019లో పిటిషనర్ కొనుగోలు చేశారని వెల్లడించారు. ఫాంహౌజ్ పకనే 3.30 ఎకరాలను పిటిషనర్ కొనుగోలు చేసి ప్రహరీగోడ నిర్మించారని తెలిపారు.
హైడ్రా వెబ్సైట్లో ఫాంహౌజ్ ఉన్న భూమి (సర్వే నంబర్ 311)ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక నాయకుడికి పిటిషనర్ సన్నిహితుడు అయినందునే రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశాలతో ఫాంహౌజ్ కూల్చివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వాదించారు. గతంలో కూల్చివేత ప్రయత్నాలు జరిగాయని, దీనికి సంబంధించి ఎన్జీటీ జారీచేసిన ఉత్తర్వులను ఇదే హైకోర్టు రద్దు చేసిందని గుర్తుచేశారు. ఏఏజీ కల్పించుకుని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపైనే చర్యలు తీసుకుంటున్నామని, ఇదేమీ కక్షసాధింపు, వివక్షపూరితం కాదని అన్నారు. ఈ దశలో కల్పించుకున్న న్యాయమూర్తి.. ఇప్పటివరకు ఎన్ని అక్రమ కట్టడాలను గుర్తించారో, ఎన్నింటికి జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారో, ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారో వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
హైడ్రాకు ఉన్న పరిధులు ఏమిటి? అధికారాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని, స్థానిక కార్యాలయ అనుమతితో నిర్మాణాలు చేపడితే.. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు? అక్రమ కట్టడాలైనా చట్ట ప్రకారం చేయాలి కదా? నిర్మాణం జరిగిన 15-20 ఏండ్లకు హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణం అని కూల్చివేయటమేమిటి? పదేండ్లుగా ఇంటి పన్ను కట్టించుకొని.. ఇప్పుడు కూల్చివేస్తే ఆ వసూళ్లకు అర్థమేమిటి? ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా?
– ప్రభుత్వం, హైడ్రాకు హైకోర్టు ప్రశ్నలవర్షం