హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్లు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది పుట్టా పద్మారావు దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. బార్ కౌన్సిళ్ల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, ఎన్నికల నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేసిందని తెలిపింది. అందువల్ల ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న చేనేత కార్మికుల రుణమాఫీకి వారం రోజుల్లో నిధులు విడుదల చేస్తామని చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములుతో కలిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ కమిషనర్‌ను కలిసి చేనేత సమస్యల గురించి వివరించారు. ముఖ్యంగా చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో బ్యాంకుల్లో చేనేత బకాయిలకు సంబంధించిన నిధులు బదిలీ చేశామని, మరో రూ.15 కోట్లు కూడా మంజూరు చేయాలని సీఎంకు కూడా లేఖ రాసినట్టు కమిషనర్ వారికి తెలిపారు.