హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ దందాలు చేస్తున్నారా? అంటూ రెవె న్యూ, పోలీసు అధికారులపై హైకోర్టు ఆగ్ర హం వ్యక్తంచేసింది. భూమిపై హకుల వివాదం సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎలా జోక్యం చేసుకుంటారని సరూర్‌నగర్ తహసీల్దార్, మీర్‌పేట పోలీసులను ప్రశ్నించింది. శాంతి భద్రతల పేరుతో కోర్టు వివాదం లో ఉన్న భూమికి సంబంధించి రెవెన్యూ అధికారుల నుంచి నివేదిక ఎలా అడుగతారని పోలీసులను నిలదీసింది. హక్కులను తేలుస్తూ ప్రొసీడింగ్స్ ఎలా జారీ చేస్తారని తహసీల్దార్‌పై మండిపడింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా కర్మన్‌ఘాట్ సర్వే నంబర్ 60లో తనకు 400 గజాల ప్లాట్ ఉన్నదని, కానీ అది సర్వే నంబర్ 58లో ఉందంటూ తహసీల్దార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ చెల్లవంటూ బీ బుజ్జి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి దీనిపై విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ ప్లాట్‌ను చక్రధర్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నామని తెలిపా రు. సివిల్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నామని, అయితే, చక్రధర్ పోలీసులను ఆశ్రయించారని కోర్టుకు తెలిపారు. పోలీసులు తహసీల్దార్‌కు లేఖ రాస్తే, ఆయన పిటిషనర్ ప్లాట్ సర్వే నంబర్ 58లో ఉన్నదని లేఖ రాశారని తెలిపారు. పిటిషనర్‌కు నోటీసులు ఇవ్వకుండా తహసీల్దార్ ప్రొసీడింగ్స్ ఎలా జారీచేస్తారని ప్రశ్నించారు. తహసీల్దార్ ప్రొసీడింగ్స్ చూపించి ప్రైవేటు వ్యక్తులు పిటిషనర్ స్థలంలోకి చొరబడినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి రెవెన్యూ అధికారులు, పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పిటిషనర్ ప్లాట్‌పై తహసీల్దార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.