Phone Tapping | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్, ఆయన కుటుంబసభ్యుల ఫోన్ల ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ హరీశ్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు సుదీర్ఘ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని పేర్కొన్నారు. చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు హడావుడిగా ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. ఎలాంటి ప్రాథమిక విచారణ చేపట్టకుండానే ఈ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. 12 నెలలు ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై చక్రధర్‌గౌడ్ కనీసం వివరణ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఘటన జరిగిన చాలాకానికి ఫిర్యాదు చేసినప్పుడు అందుకు సహేతుకమైన కారణాలను వివరించకపోతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేసు చెల్లదని గుర్తుచేశారు.
హరీశ్‌రావుపై కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు, చక్రధర్‌రావు అభియోగాలకు పొంతన లేదన్నారు. ఐఫోన్ల వినియోగదారులకు ‘యాపిల్’ కంపెనీ నుంచి తరుచుగా వచ్చే ఒక మెసేజ్‌ను ఆధారంగా చేసుకుని చక్రధర్‌గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్టు చెప్పడం వెనుక అనుమానాలే తప్ప ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై నిరుడు నవంబర్ 22న హైకోర్టులో వేసిన పిటిషన్‌ను చక్రధర్‌గౌడ్ కొన్ని రోజులకే ఉపసంహరించుకున్నారని, ఆ మరుసటిరోజే డీజీపీకి, తిరిగి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో దాన్ని పంజాగుట్ట పోలీసులకు ఫార్వర్డ్ చేశారని గుర్తుచేశారు. 2008 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చక్రధర్‌గౌడ్‌పై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. సిద్దిపేటలో బీఎస్పీ తరఫున పోటీచేసి ఓడిపోయిన చక్రధర్‌గౌడ్ పిటిషనర్‌పై 2021 నుంచి ఏదో ఒక కేసు నమోదు చేస్తూనే ఉన్నారని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని వివరిస్తూ.. హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని కోరారు. దీ
నిపై ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. చక్రధర్‌గౌడ్ ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టు ‘యాపిల్’ కంపెనీ నుంచి ఈ-మెయిల్ ద్వారా ఆయనకు మెసేజ్ వచ్చిందని తెలిపారు. రాజకీయంగా ప్రత్యర్థులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సాధారణమే అయినప్పటికీ చక్రధర్‌గౌడ్, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును అడ్డుకోరాదని కోరుతూ.. అభియోగాలపై దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ట్యాపింగ్‌పై నాకూ మెసేజ్‌లు: జస్టిస్ లక్ష్మణ్
ఈ వాదనపై జస్టిస్ కే లక్ష్మణ్ స్పందిస్తూ.. తాను కూడా ఐఫోన్ వాడుతున్నాని, తన ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతున్నట్టు మెసేజ్‌లు వచ్చినప్పటికీ అవి రొటీన్‌గా వచ్చే మెసేజ్‌లు కావడంతో పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. అనంతరం ఈ కేసులో హరీశ్‌రావును అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులను మరోసారి పొడిగిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.