High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై నమోదు చేసిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో పోలీసుల వ్యవహారంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు పేరుతో వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టులో ఒకటి చెప్పి.. మరొక విధంగా దర్యాప్తు చేయడంపై మండిపడింది. కోర్టులతో గారడీ చేస్తున్నారా అంటూ నిప్పులు చెరిగింది. హరీశ్‌రావుతోపాటు మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావుపై దర్యాప్తు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో వారిద్దరినీ అరెస్ట్ చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ కేసులో పోలీసులు ఒకవైపు కోర్టులో గడువు కోరుతూ మరోవైపు కేసు దర్యాప్తు పేరుతో అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించింది.
కోర్టులతో ఇలాంటి ట్రిక్స్ (గారడీ) చేయవద్దని హెచ్చరించింది. తమపై పంజాగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ హరీశ్‌రావు, రిటైర్డు డీసీపీ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరిపారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు సుప్రీంకోర్టు నుంచి సిద్ధార్థ లూథ్రా హాజరుకానున్నారని, విచారణను మార్చి 3 లేదా 7వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. దీనిపై హరీశ్‌రావు తరఫు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు స్పందిస్తూ.. ఇప్పటికే పోలీసులు మూడుసార్లు వాయిదా కోరారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ వాయిదా కోరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వాయిదాల పేరుతో క్రూరమైన కుట్రను అమలుచేసే లక్ష్యం ఉందని అన్నారు. అందుకే పదేపదే వాయిదాలు కోరుతున్నారని చెప్పారు. ఈ నెల 12న విచారణ పూర్తయ్యాక 15న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. వాళ్లను భయపెట్టి నేరాంగీకార వాంగ్మూలాలను తీసుకోవడానికి పోలీసులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో మూడో నిందితుడిని అరెస్ట్ చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, ఆ నిందితుడి రెండేళ్ల బాలుడితోపాటు భార్యను కూడా పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి 1.30 గంటల వరకు ఉంచారని చెప్పారు. వేధింపులకు గురిచేసి పేపర్లపై సంతకాలు తీసుకున్నారని, టార్చర్ పెట్టాక తెల్లకాగితాలపై సంతకాలు చేయించిన వాటిని పిటిషనర్లకు (హరీశ్‌రావు, రాధాకిషన్‌రావు) వ్యతిరేకంగా అఫిడవిట్లుగా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పోలీసులు కోరినట్టు కేసు విచారణను వాయిదా వేస్తే పిటిషనర్లకు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. మరోసారి గడువు ఇస్తే చిన్నచిన్న ఉద్యోగులను భయపెట్టి వాంగ్మూలం తీసుకుని పిటిషనర్లను కేసులో ఇరికించాలనే కుట్ర అమలయ్యే అవకాశం ఉందని చెప్పారు.
ఒక ఉన్నతాధికారి సాక్షిని బెదిరించారని, నరకం అంటే తెలుసా, తాము చెప్పినట్లు చేయకపోతే నరకాన్ని ఇకడే చూపిస్తామని ఆ అధికారి బెదిరించారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. కేసు వాయిదాల పేరుతో న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని, వెంటనే కోర్టు స్పందించాలని కోరారు. ఈ వాదనను పీపీ నాగేశ్వరరావు వ్యతిరేకించారు. వేధింపులకు గురిచేస్తే కింది కోర్టులో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పిటిషనర్లు ఇద్దరినీ అరెస్టు చేయరాదన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉండగా, కేసు దర్యాప్తును నిలిపివేయాలని కోరడం అన్యాయమన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, అరెస్టు చేసిన వారితో పిటిషనర్లకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు తీసుకుంటున్నారని న్యాయవాదులు చెప్తున్నారని గుర్తుచేసింది. నిందితుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారా లేదా అని ప్రశ్నించింది. కేసు విచారణ కోరుతూ మరోవైపు దర్యాప్తు పేరుతో నిందితులను అరెస్టు చేయడమంటే కోర్టులతో గారడీ చేయడం కాకపోతే ఏమౌతుందని ప్రశ్నించింది. చివరికి పీపీ వినతి మేరకు విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు కేసు దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది.