హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి 50 సంవత్సరాల క్రితం తీసుకున్న 60 ఎకరాల భూమికి ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆలయానికి పరిహారం చెల్లించాలంటూ 2008లో సింగిల్ జడ్జి, 2022వ సంవ త్సరంలో డివిజన్ బెంచ్ జారీచేసిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది. భూసేకరణ చట్టం-2013 ప్రకారం ఇప్పటికైనా ఆ ఆలయానికి పరిహారం చెల్లించాలని, నాలుగు వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోడ్డు నిర్మాణం కోసం 1975వ సంవత్సరంలో తీసుకున్న ఆ భూమికి పరిహారం చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ ఆ ఆలయం తరఫున ఈవో పీ వెంకటరమణ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేశారు.
భూసేకరణకు ఆదేశిస్తే ఎఫ్టీఎల్ వివాదాలకు తెర ; హైకోర్టు అభిప్రాయం
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, నాలాలకు చెందిన పట్టాదారుల పిటిషన్లపై భూసేకరణకు ఆదేశిస్తే ఎఫ్టీఎల్ వివాదాలకు తెరపడుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకవైపు ఆ ప్రాంతవాసులకు రెవెన్యూశాఖ పట్టా పాస్‌పుస్తకాలు జారీ చేస్తుంటే మరోవైపు అది ఎఫ్టీఎల్ లేదా బఫర్‌జోన్ అని నీటిపారుదల శాఖ ఇది పేరొనడం వివాదాలకు తెరలేపుతున్నదని తీవ్రంగా తప్పుపట్టింది. హైదరాబాద్ జవహర్‌నగర్‌లో కాంపౌండ్ వాల్‌ను తొలగించి తన భూమిలోకి డ్రైనేజీ నీటిని వదలాలన్న నీటిపారుదల శాఖ డీఈఈ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ పీ నర్సింహారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ కాంపౌండ్‌ను కూల్చడం ద్వారా పట్టా భూమిలోకి మురుగునీటిని వదిలేందుకు నీటిపారుదల శాఖ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. ప్రహరీని తొలగించకపోతే కాలనీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ఏండ్ల తరబడి ఎఫ్టీఎల్ సమస్యతో కోర్టులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి, విచారణను వాయిదా వేసింది.