మాదాపూర్, డిసెంబర్ 3: సున్నం చెరువు విషయంలో హైడ్రా అధికారులకు బుధవారం హైకోర్టు షాకిచ్చింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని సియేట్ మారుతి హిల్స్ సొసైటీ కాలనీ సర్వే నంబర్లు 12, 12ఏ, 13లో గత కొన్ని నెలల నుంచి కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తవ్వకాలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)ను ఏవిధంగా నిర్ధారించారని, కోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్కడ పనులు ఎలా చేస్తారని నిలదీసింది. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారమే పనులు చేస్తున్నామని హైడ్రా అధికారులు తెలిపారు. సున్నం చెరువు పునరుద్ధరణ పనులను స్థానికులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ.. తమకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.
అనంతరం సియేట్ సొసైటీ నివాసితుల తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. హైడ్రా చెరువు హద్దులు దాటి అక్రమంగా ప్రైవేట్ భూ ముల్లో ప్రవేశించిందని వివరించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. చెరువుల్లో పనులు చేపట్టేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయని, చెరువు హద్దులను నిర్ధారించిన తర్వాతే పనులు చేపట్టాలని గతంలో ఇదే హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఆ ఆదేశాలను విధి గా పాటించాల్సిందేనని, బఫర్ జోన్‌ను గుర్తించి పూర్తి సర్వే చేయాలని, చెరువు హద్దులు దాటి పనులు చేయరాదని స్పష్టంచేశారు. సియేట్ సొసైటీ బాధితుల గోడు వినేందుకు రెవెన్యూ డివిజనల్ అధికారిని లేదా అతని కంటే ఉన్నత అధికారిని నియమించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఆ అధికారి స్వయంగా అక్కడ పరిశీలన జరిపి వీడియో తీయడంతోపాటు స్వతంత్రంగా సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.