హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి డీఎంఐటీ (డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్) కోర్సు పూర్తి చేసిన అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎంమొహియుద్దీన్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సీటీ సానర్, ఎక్స్‌రే, ఎంఆర్ఐ తదితర టెక్నీషియన్ పోస్టుల భర్తీకి జూన్ 22న జారీచేసిన నోటిఫికేషన్లో డీఎంఐటీ అభ్యర్థులను అర్హుల జాబితాలో చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన ఎం ప్రకాశ్ తదితరులు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు టిమ్స్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయరాదని ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.