హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో, కుట్రపూరితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదు చేసిన రెండు తప్పుడు కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. గత ఏడాది మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించిన సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, ఆ తరువాత ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన సందర్భంగా ఉట్నూరులో వేర్వేరు ఆరోపణలతో కేటీఆర్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. గత నెల 18న ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుబట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, సరైన విచారణ కూడా జరుపకుండా కేసు నమోదు చేసిన తీరును ఆక్షేపించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాలసుమన్పై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు గత ఏడాది జూలై 26న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఎటువంటి సమాచారం లేకుండా తమ అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించారని మేడిగడ్డలోని నీటిపారుదలశాఖ సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వలీషేక్ చేసిన ఫిర్యాదు మేరకు మహదేవ్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో న్యాయమూర్తి తీర్పును వెలువరిస్తూ.. ‘మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదు. దర్యాప్తు అధికారి కేసును నిబంధనల ప్రకారం నమోదు చేయలేదు. అదనపు ఆరోపణ చేస్తూ మెమోను దాఖలు చేయడం కూడా చెల్లదు. సాక్షులందరూ ఒకే రకమైన వాంగ్మూలం ఇచ్చారు.
ఈ వాంగ్మూలం ఆధారంగా అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయడం చెల్లదు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద మేడిగడ్డను నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత ప్రాంతంగా చేయాలని కేంద్రాన్ని కోరి తే సరిపోదు. కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాలి. కానీ కేంద్రం నోటిఫికేషన్‌ను వెలువరించలేదు. ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని సెక్షన్ 10ఏ ఉల్లంఘనకు సంబంధించి జరిమానా విధించాలి. ఆ పరిధి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. కేటీఆర్, ఇతరులు గత ఏడాది జూలై 26న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శిస్తే మూడున్నర రోజుల తర్వాత వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మూడు రోజులు ఎందుకు జాప్యం జరిగిందో వివరణ కూడా లేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చూసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం వల్ల ఫిర్యాదు చేయడం ఆలస్యమైందనే కారణం ఎంతమాత్రం సంతృప్తికంగా, ఆమోదయోగ్యంగా లేదు. కేసు నమోదు చేయడంలో దర్యాప్తు అధికారి చట్ట నిబంధనలను అనుసరించలేదు. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం మహదేవ్పూర్ పోలీసుస్టేషన్లో పిటిషనర్లపై నమోదైన కేసు కొనసాగింపు జరిగితే అది న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుంది. అందుకే పిటిషనర్లపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తున్నాం’ అని పేరొన్నారు.
సీఎం ఏ రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)పై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసులు నమోదు చేసిన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల కోట్ల నిధులను కాంగ్రెస్‌పార్టీ తరలించిందని కేటీఆర్ చేసిన ఆరోపణల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరిగిందంటూ ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉట్నూరు పోలీసుస్టేషన్లో గత ఏడాది సెప్టెంబరు 30న కేసు నమోదైంది.
ఈ కేసును కొట్టేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను న్యాయమూర్తి అనుమతించారు. ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పిటిషనర్‌పై ఎఫ్ఐఆర్ను కొనసాగించడం సరికాదని అన్నారు. కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. కేటీఆర్ ఎవరిపైనా వ్యక్తిగత ఉద్దేశాలతో విమర్శలు చేయలేదని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఫిర్యాదుల్లో నేరం ఏమిటో పేరొనలేదని ఆక్షేపించారు. రాజకీయ కక్షసాధింపుతో నమోదైన కేసులను కొట్టివేయాలన్న వాదనను న్యాయమూర్తి అంగీకరించారు.
పిటిషనర్ ఎలాంటి తప్పు చేయకున్నా తప్పుడు కేసు నమోదు చేశారని, విచారణ సహా తదుపరి చర్యలు నిలిపివేయడంతోపాటు ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కేటీఆర్ తరఫున న్యాయవాది టీవీ రమణారావు చేసిన వాదనలను న్యాయమూర్తి ఆమోదించారు. డ్రోన్ ఎగురవేయడం వల్ల మేడిగడ్డ రిజర్వాయర్‌కు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనను తోసిపుచ్చారు. డ్రోన్ ఎగురవేతకు వీల్లేదని, మేడిగడ్డను నిషేధిత ప్రాంతంలో చేర్చారన్న వాదనను కొట్టివేశారు. ప్రజాసమస్యను పరిష్కరించాలనే సంకల్పంతో కేటీఆర్ ఇతర పిటిషనర్లు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శిస్తే, ఎలాంటి విచారణ చేయకుండానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు.