హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలపై నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 7 ప్రశ్నలపై పిటిషనర్లు లేవనెత్తిన సందేహాలకు కమిషన్ ఇచ్చిన సమాధానాలు ఆమోదయోగ్యంగానే ఉన్నాయని పేర్కొన్నది. ఈ మేరకు జస్టిస్ పుల్లా కార్తీక్ మంగళవారం తీర్పును వెలువరించారు. ఉన్నతాధికారుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించే గ్రూప్-1 పరీక్షలో ప్రశ్నలు సూటిగా ఉండాలని అభ్యర్థులు కోరుకోవడం సరికాదని, అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు మెలికలతో కూడిన ప్రశ్నలు ఇవ్వడం పరిపాటేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ పరీక్షలపై 1,721 మంది అభ్యర్థులు వ్యక్తం చేసిన 6,417 అభ్యంతరాలను ఆయా సబ్జెక్టులకు చెందిన నిపుణుల కమిటీ పరిశీలించిందని, ఆ తర్వాతే కీని విడుదల చేసి, ఫలితాలను ప్రకటించారని తెలిపారు. ఈ వ్యవహారంలో నిపుణుల కమిటీ నిర్ణయమే అంతిమమని, అందులో జోక్యానికి ఆసారం లేదని పేర్కొన్నారు. 2022లో వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష నిర్వహించాలన్న మరో పిటిషన్‌ను కూడా కొట్టివేస్తున్నట్టు జస్టిస్ కార్తీక్ ప్రకటించారు.