హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తేతెలంగాణ) : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు వల్ల మరణించిన 54 మంది కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ఆ కంపెనీ యాజమాన్యంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఉత్తదేనని తేలిపోయింది. మృతుల కుటుంబాలకు రూ.42 లక్షలు చొప్పున మా త్రమే పరిహారం చెల్లించినట్టు ఆ కంపెనీ హైకోర్టులో ప్రకటించింది. మరోవైపు ఈ దుర్ఘటనపై పలు ప్రభుత్వ శాఖలు లోతుగా దర్యాప్తు చేసినప్పటికీ బాధ్యులను తేల్చలేకపోయామని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం తన నిస్సాహాయతను వ్యక్తం చేసింది. సిగాచీలో రియాక్టర్ పేలుడు ఘటనపై దర్యాప్తును సిట్‌కు అప్పగించేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ సైంటిటస్టు కే బాబూరావు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదన వినిపిస్తూ.. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చి కేవలం రూ.42 లక్షల చొప్పున చెల్లించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. గతంలో సిగాచీ యాజమాన్యం, సీఎం హామీ ఇచ్చినట్టుగా బాధితులకు రూ.కోటి చెల్లించేలా చూడాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. ఈ కేసులో రెండో నిందితుడైన సిగాచీ సంస్థ సీఈవో అమిత్‌రాజ్ సిన్హాను పోలీసులు అరెస్టు చేశారని, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పలు ప్రభుత్వ శాఖలు దర్యాప్తు జరిపినప్పటికీ బాధ్యులెవరో తేల్చలేకపోయారని అంగీకరించారు. దర్యాప్తు అధికారులు 300 మందికిపైగా సాక్షులను ప్రశ్నించారని చెప్పారు. ఇప్పటివరకు రూ.22 కోట్ల పరిహారం చెల్లింపులు జరిగాయని తెలిపారు.
సిగాచీ కంపెనీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. మృతుల కుటుంబాలకు చట్టప్రకారం (బీమాతోపాటు ఇతర ప్రయోజనాల కింద వచ్చే సొమ్ముతో కలిపి) మొత్తం రూ.కోటి చొప్పున చెల్లిస్తామని ప్రకటించామని వివరించారు. ఇందులో కంపెనీ తరఫున చెల్లించే పరిహారం రూ.42 లక్షలు మాత్రమేనని, ఈ మేరకు బాధిత కుటుంబాలకు చెల్లింపులు జరిగాయని పేర్కొంటూ.. ఇదే తుది పరిహారం కాదని తెలిపారు. మరోమైపు సిగాచీ దుర్ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది.