హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ నిబంధనల ప్రకారం ఉన్నదో లేదో చూసి నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. తన ఎన్నికను సవాల్ చేస్తూ లక్ష్మణ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టేయాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన అనుబంధ అప్లికేషన్లో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీచేశారు.
ఎన్నికల పిటిషన్‌ను దాఖలు చేసినప్పుడు పిటిషన్‌తోపాటు దానితో జత చేసే ప్రతి కాపీపైనా పిటిషనర్ సంతకం చేసితీరాలి. అటెస్ట్ కూడా చేయాలి. ఈ నిబంధన పాటించనందున పిటిషన్‌ను కొట్టేయాలని కొప్పుల మధ్యంతర అప్లికేషన్లో కోరారు. ఓట్ల లెక్కింపునకు చెందిన వివరాలన్నీ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్నప్పటికీ వాటిని ఆధారంగా చూపలేదని, వాటిని సమర్పించేలా ఆదేశించాలని కూడా కోరారు. ఈ అభ్యంతరాలను హైకోర్టు తిరసరించింది. పిటిషన్ విచారణార్హతపై గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే హైకోర్టు కొట్టేసిన విషయాన్ని గుర్తుచేసింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఏవిధమైన ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపింది. ఎన్నికల పిటిషన్ దాఖలు చేసినప్పుడు పిటిషనర్ స్వయంగా సంతకం చేయాలన్న నిబంధనను లక్ష్మణ్ అమలు చేయలేదంటూ కొప్పుల అభ్యంతరంపై నివేదిక అందజేయాలని రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీచేసింది. మధ్యంతర పిటిషన్‌పై విచారణను ముగించింది.