హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): పోలీస్ శాఖలో పోస్టుల ఖాళీ వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీస్ శాఖలోని పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ‘హెల్ప్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్’ తరఫున కే అఖిల్ శ్రీగురుతేజ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచార ణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీస్ శా ఖలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంలేదని తెలిపారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ వాదనలు వినిపిస్తూ.. 7వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయనున్నామని, మిగిలిన పోస్టులు పరిశీలనలో ఉన్నదని చెప్పా రు. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.