హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : రుణం కోసం తాకట్టు పెట్టిన ఆస్తులను చట్టప్రకారం వేలం వేసే అవకాశం బ్యాంక్‌కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. రుణాన్ని తీర్చకపోవడంతో అధికారిక లిక్విడేటర్ పరిధిలోకి వెళ్లిన బీఆర్ ఎనర్జీ లిమిటెడ్ ఆస్తిని లిక్విడేటర్ ప్రమేయం లేకుండా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) చట్టవిరుద్ధంగా వేలం వేయడాన్ని ఆక్షేపించింది. ఆ ఆస్తి వేలాన్ని రద్దుచేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదించింది.
కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ యూబీఐ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. బీఆర్ ఎనర్జీస్ ఆస్తిని రూ.32.94 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆ కంపెనీ డైరెక్టర్ ఓ పార్టీని, రూ.10 కోట్ల డీడీని తీసుకొచ్చినా పట్టించుకోకుండా వేలం నిర్వహించి, ఆ ఆస్తిని రూ.25.80 కోట్లకు విక్రయించడం సరికాదని జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం పేర్కొన్నది. వేలంలో ఆ ఆస్తిని పొంది రూ.6.45 కోట్లు చెల్లించిన కేజేఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆ సొమ్మును 6% వడ్డీతో తిరిగి చెల్లించాలని ధర్మాసనం యూబీఐని ఆదేశించింది.