హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ,అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాలను తొలగించేందుకు చేపట్టే చర్య లు నిబంధనలకు లోబడే ఉండాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆయా విద్యాసంస్థలు చూపే ఆధారాలను లోతుగా పరిశీలించాలని, చెరువులో ఉన్నట్టు నిర్ధారణ అయ్యాకే నిర్మాణాలను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీ, నీలి మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ టీ వినోద్‌కుమార్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు.
భూములపత్రాలు, వివరాలను అందజేశాక వాటిని పరిశీలించి వివరణ ఇచ్చేందుకు కనీసం వారం రోజులు గడువు ఉండేలా చూడాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. నాదం చెరువుకు సంబంధించిన సర్వే మ్యాప్‌ను పరిశీలించాలని హైకోర్టును కోరారు.
1951-54 కాస్రా పహాణీ ప్రకారం.. 61 ఎకరాల విస్తీర్ణంలో చెరువు, అక్కడి నుంచి 30 మీటర్ల మేరకు బఫర్‌జోన్ ఉన్నదని, పిటిషనర్ల నిర్మాణా లు ఈ బఫర్‌జోన్‌లోనే ఉన్నాయని తెలిపారు. చట్టానికి లోబడే చర్యలు చేపడతామని, ఆక్రమణల నిర్ధారణకు సంబంధించిన పత్రాలను పిటిషనర్లకు అందజేశాకే తదుపరి చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈలోగా పిటిషనర్లు ఇతర నిర్మాణాలు చేపట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎప్పుడో 1970 నాటి సర్వేలపై ఆధారపడటం కంటే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల ఆధారంగా చెరువు విస్తీర్ణాన్ని నిర్ధారిస్తే బాగుటుందని పేర్కొన్నారు. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చే వరకు ఆక్రమణల తొలగింపులు ఉండవని చెప్తున్నప్పుడు చెరువు విస్తీర్ణాన్ని సర్వే ఆఫ్ ఇండియా ఎస్ఆర్ఎల్సీ మ్యాప్‌ల ఆధారంగా నిర్ధారిస్తేనే బాటుందని అభిప్రాయపడుతూ.. ఈ పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.