హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ఆలిండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించడానికి సవాల్ చేస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు షెహనాజ్ తబస్సుమ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. 2024లో ఎన్నికల్లో పోటీచేసిన తమ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అన్యాయంగా రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించిందని, దీనిపై చేసిన అప్పీలుపై నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నదని, అప్పీల్‌ను ఈసీ పెండింగ్‌లో ఉంచితే తమ పార్టీ నష్టపోతుందని పేర్కొన్నారు.
దీనిపై ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ ప్రతివాదన చేస్తూ.. కనీసం ఆరుసార్లు ఎన్నికల్లో పోటీచేసిన పార్టీనే రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో కొనసాగించేందుకు వీలుంటుందని వివరించారు. ఈసీ వద్ద రిజిస్టర్ అయి ఎన్నికల్లో పోటీచేయని 473 రాజకీయ పార్టీలను రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించినట్టు చెప్పారు. పిటిషనర్ సమర్పించిన అప్పీలును పరిషరిస్తామని తెలిపారు. దీంతో పిటిషనర్ పార్టీ అప్పీలును ఈ నెల 30లోగా పరిషరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఈసీని ఆదేశించింది.