హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్లకు ఎగనామం పెడతారనే ఆందోళన బీసీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన నిర్వహించి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లోనూ ప్రకటించింది. అయితే, అధికారంలోకి వచ్చిన అనంతరం అడ్డదిడ్డంగా, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కులగణన సర్వేను నిర్వహించిందనే ఆరోపణలున్నాయి. డెడికేటెడ్ కమిషన్ నేతృత్వంలో కులగణన కొనసాగించాల్సి ఉండగా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అశాస్త్రీయంగా సర్వే నిర్వహించిందనే విమర్శలున్నాయి. ఆ సర్వేకు సంబంధించిన గణాంకాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల వారీగా వెల్లడించిన ప్రభుత్వం.. ఇతర ఉపకులాలవారీగా గణాంకాలను గోప్యంగా ఉంచింది. ఆ గణాంకాలతోనే బీసీలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ మార్చి17న శాసనసభ సమావేశాల్లో వేర్వేరుగా బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది. వాటిని గవర్నర్ ఆమోదానికి పంపింది. అవి ప్రస్తుతం గవర్నర్ వద్దే పెండింగ్లో ఉన్నాయి.
బిల్లులను గవర్నర్తో ఆమోదింప జేసుకునేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం జరగడం లేదన్న విమర్శలున్నాయి. గవర్నర్ వాటిని ఆమోదిస్తారో, తిప్పిపంపుతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే, రాష్ర్టాలు నిర్వహించే కులగణన సర్వేలకు ఎలాంటి చట్టబద్ధత లేదని, ఆ గణాంకాలకు సాధికారత కూడా ఉండబోదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తేల్చిచెప్పింది. జనాభా గణనలోనే కులగణనను కూడా తామే నిర్వహిస్తామని ప్రకటించి, అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా జారీచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన, ఆ గణాంకాలతో రూపొందించిన బిల్లులకు సైతం ప్రామాణికత లేకుండా పోయిందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.