హైదరాబాద్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలు చేయరాదన్న ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యు లు, ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేయడంపై నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మూడు నెలలుగా కాలయాపన చేయడంలో ఆంతర్యం ఏమిటని నిలదీసింది. నివేదిక సమర్పించని రంగారెడ్డి కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. తేదీ లేకుండా రాతపూర్వక వివరణ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. తాము గతంలో ఆదేశించిన మేరకు వారం రోజుల్లోగా నివేదిక ఇచ్చి తీరాలని న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శుక్రవారం స్పష్టంచేశారు. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
అసెంబ్లీలో ప్రశ్నించకుండాకోర్టుకెందుకొచ్చారు? ; ఎమ్మెల్యేను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలపై ఎమ్మెల్యేగా ఉంటూ అసెంబ్లీలో చర్చించకుండా కోర్టును ఎందుకు ఆశ్రయించారని కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కే వెంకటరమణారెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. ఆక్రమణలపై అసెంబ్లీలో చర్చించే స్థాయి ఉన్న వ్యక్తి హైకోర్టుకు రా వడం ఎందుకని వాపోయింది. చెరువుల ఆక్రమణలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వంతోపాటు హైడ్రా, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు నోటీసులిచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తితే మంత్రి స్పందిస్తూ.. ఆక్రమణల తొలగింపునకు హైడ్రా ఏర్పాటు చేశామని చెప్పారని తెలిపారు. అనంతరం విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.