Group 2 Exams | ఒకే రోజు రెండు పరీక్షలు.. గ్రూప్-2 వాయిదా వేయాలంటూ హైకోర్టుకు
ఆర్ఆర్బీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు ఆఖరుకు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం గోడును వినకపోవడంతో గ్రూప్-2ను వాయిదావేయాలని సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఒకే రోజు గ్రూప్-2, ఆర్ఆర్బీ పరీక్షలు
గ్రూప్ -2 వాయిదా వేయాలంటున్న అభ్యర్థులు
సర్కారు పట్టించుకోకపోవడంతో హైకోర్టుకు
Group 2 Exams | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఆర్ఆర్బీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు ఆఖరుకు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం గోడును వినకపోవడంతో గ్రూప్-2ను వాయిదావేయాలని సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 7,951 జూనియర్ ఇంజినీరింగ్(జేఈ) పోస్టులను రైల్వేశాఖ భర్తీచేస్తున్నది. బీటెక్, డిగ్రీ అర్హతలున్న వారు ఈ పోస్టులకు పోటీపడొచ్చు. ఇదే బీటెక్ అర్హత గల వారు గ్రూప్-2కు దరఖాస్తు చేసుకున్నారు. అటు గ్రూప్-2, ఇటు ఆర్ఆర్బీ రెండు పరీక్షలు రాసే వారు 20 మందికి పైగా ఉన్నట్టుగా తేలింది.
గ్రూప్-2 పరీక్షలు 15, 16న జరగనుండగా, 16న ఆర్ఆర్బీ జూనియర్ ఇంజినీర్(జేఈ) పరీక్ష జరగనుంది. ఒకే రోజు రెండు పరీక్షలుండటంతో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై అభ్యర్థులు ఇటీవలే టీజీపీఎస్సీ చైర్మన్కు వినతిపత్రాన్ని సమర్పించారు. అయినా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండటంతో పరీక్ష వాయిదాకు పోరుబాట పట్టాలని నిర్ణయించిన అభ్యర్థులంతా వాట్పాప్ గ్రూపుగా ఏర్పడ్డారు. వీరు సోమవారం హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేయనున్నారు.
మొండికి పోయి అన్యాయం చేయొద్దు
గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మొండికి పోయి మాకు అన్యాయం చేయవద్దు. ఎన్నో ఏండ్ల తర్వాత ఆర్ఆర్బీ జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేడేండ్ల తర్వాత గ్రూప్-2 నోటిఫికేషన్ సైతం వచ్చింది. రెండు ముఖ్యమైన పరీక్షలే. దీంతో మేమంతా ఆందోళనలో ఉన్నాం. గ్రూప్-2 పరీక్షలను వాయిదావేయాలని కోరినా పట్టించుకోవడం లేదు. మా గోడు వినడంలేదు. విధిలేని పరిస్థితుల్లో మేం హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నాం.