హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఇప్పుడు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీ ఇప్పుడు బీటెక్ సిటీగా మారిపోయింది. రాష్ట్రంలో బీటెక్ చదువులకు భాగ్యనగరమే కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలుంటే 109 హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. మేడ్చల్ – మల్కాజిగిరిలో అత్యధికంగా 45 ఉండగా, ఆ తర్వాత రంగారెడ్డిలో 41, హైదరాబాద్‌లో 21 కాలేజీలున్నాయి. 9 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంజినీరింగ్ కాలేజీ లేకపోవడం గమనార్హం. మరో 9 జిల్లాల్లో ఒకటి చొప్పున మాత్రమే ఉన్నాయి. అత్యధిక కాలేజీలు ఈ మూడు జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉండటంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ మూడు జిల్లాల్లోని కాలేజీల్లోనే చేరాల్సి వస్తోంది. దీంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఇటీవలే అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పించారు.
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. దీనికి తోడు తెలంగాణ ఐటీ రంగం గణనీయమైన పురోభివృద్ధి సాధించింది. ఇదే కోవలో విద్యావకాశాలు గణనీయంగా పెరిగాయి. ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండటం, భవిష్యత్తులో ప్లేస్‌మెంట్స్, క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కంపెనీలు ఇక్కడి విద్యార్థులనే ఎంపికచేసుకునే అవకాశముండటంతో విద్యార్థులు హైదరాబాద్‌లో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్‌గా రూపాంతరం చెందింది.