Cyclone | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది. సోమవారం ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తెలుగు రాష్ర్టాల్లో రాబోయే 4 రోజులు మోస్తరు నుంచి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈనెల 27,28 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ఖమ్మం, నల్లగొండ,సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట,జోగులాంబ-గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 27న రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదే విధంగా ఈనెల 28న రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.