హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): హీరా గ్రూప్ సంస్థల చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఆ సంస్థలతోపాటు వాటి అధినేత నౌహీరా షేక్ నుంచి జప్తు చేసిన ఆస్తుల వేలాన్ని ఈడీ వేగవంతం చేసింది. వాటిలో ఓ స్థిరాస్తిని ఇటీవల విజయవంతంగా వేలం వేయడంతో రూ.19.64 కోట్లు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు జరిగిన ఆస్తుల వేలం ద్వారా రూ.68.63 కోట్లు సమకూరాయి.
ఈ నేపథ్యంలో మరికొన్ని ఆస్తులను త్వరలో వేలం వేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఈసారి బిడ్డర్ల నుంచి సుమారు రూ.25 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నది. వేలం ద్వారా వచ్చిన నిధులను ‘హీరా గోల్డ్’ చేతిలో మోసపోయిన బాధితులు, పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నారు. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే ఏటా సుమారు 36% లాభాలు వస్తాయంటూ డిపాజిటర్లను నమ్మించిన ‘హీరా గోల్డ్’ సంస్థలు మొత్తం రూ.5,978 కోట్ల మోసాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ కంపెనీలతోపాటు నౌహీరా షేక్, ఆమె బంధువుల పేరిట ఉన్న రూ.428 కోట్ల ఆస్తులను జప్తు చేశారు.