నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9: గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు గురువారం ఎగువ నుంచి 2,94,550 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్ట్ 33 వరద గేట్లు ఎత్తి 2,49,900 క్యూసెక్కుల వరదను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా 1,088.20 అడుగుల (77.063 టీఎంసీల) వద్ద ఉన్నది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 44,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టులో 1,405.00 అడుగులు 17.80 టీఎంసీల నీటి మట్టంతో ఉండగా 8 గేట్ల ద్వారా 44,600 క్యూసెక్కుల నీటిని మంజీరాలో కి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి బరాజ్‌లో 77 గేట్లను ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. బరాజ్‌కు 9,75,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉండగా 8.714 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
కృష్ణా బేసిన్లో..
జూరాల ప్రాజెక్టుకు మూడ్రోజులుగా స్థిరంగా వస్తున్న వరద గురువారం స్వల్పంగా తగ్గింది. 64 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 2 గేట్ల నుంచి 14,016 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 15,587 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 13,092 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయానికి 73,801 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.80 అడుగుల మేర నిల్వ ఉన్నది. మూసీ నదికి 937 క్యూసెక్కుల వరద వస్తుండగా మూడు గేట్లు ఎత్తి 7,154 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.