హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Rain Update) అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శనివారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరు వర్షాలు పడుతున్నాయి. భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి లోలెవల్ వంతెనపై వరద కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తొలుత వాహనాలను అనుమతించినా ప్రవాహ వేగం పెరగటంతో ఇరువైపులా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో వాహనాలు బారులు తీరాయి. గురువారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీవర్షాలు పడ్డాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా యాచారంలో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లా మల్లంపల్లి, యాదాద్రి జిల్లా కొలనుపాకలో 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా మోటకొండూరులో 16.5, సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో 15.3, రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.