హైదరాబాద్, మార్చి 30 ( నమస్తే తెలంగాణ ) : మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా తయారైంది పత్తి రైతుల పరిస్థితి. ఇప్పటికే పత్తికి ఆశించిన ధరలేక కుదేలైతున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం బీటీ-2 పత్తి విత్తన ప్యాకెట్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. రూ. 864 ఉన్న ప్యాకెట్ ధరను రూ. 901గా నిర్ణయించింది. దీంతో రైతులపై ఒక్కో ప్యాకెట్‌పై రూ. 37 భారం పడనుంది. రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్లో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఎకరానికి 2 ప్యాకెట్ల చొప్పున మొత్తం కోటి ప్యాకెట్లు అవసరం అవుతాయి. ప్రభుత్వం 2.4 కోట్ల విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచి ంది. రైతులు 2 కోట్ల ప్యాకెట్లు కొనుగోలు చేస్తారని అంచనాలున్నాయి. దీంతో రైతులపై ఒక్కో ప్యాకెట్‌పై రూ. 37 చొప్పున.. 2 కోట్ల ప్యాకెట్లకు గానూ రూ. 74 కోట్ల భారం పడనుంది. కా గా, ఈ ఐదేండ్లలో కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తన ప్యాకెట్ల ధరలను పెంచుతూ.. ఒక్క ప్యాకెట్‌పై రూ. 171 మేర రైతులపై కేంద్రం భారం మోపింది.