హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత మూడు, నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్ళే కొద్ది.. దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో ఉత్తర, పరిసర మధ్య బంగళాఖాతంలో రాగల 48 గంటలలో అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 2.1 కి.మీ నుండి 3.6 కి.మీ మధ్య కొనసాగుతుంది.
ఈ క్రమంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.